జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, తమ పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు.

 

జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన జిల్లా పోలీస్ అధికారులు.

బాపట్ల, అక్టోబర్ 22(పల్నాడుఅప్డేట్స్):జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్, ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, తమ పరిధిలోని పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో, డ్రగ్స్ వలన కలిగే అనర్థాలు మరియు సైబర్ నేరాలు జరుగుతున్న తీరును గురించి విద్యార్థులకు వివరంగా అవగాహన కల్పించారు. ప్రస్తుతం యువతలో డ్రగ్స్ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, వారికి ఈ విషయంలో సరైన మార్గదర్శనం అవసరమని అధికారులు తెలిపారు.నేటి యువతే రేపటి దేశ భవిష్యత్ అని, చిన్న పొరపాటు వారి జీవితాన్ని గందరగోళానికి గురిచేస్తుందని, డ్రగ్స్ వినియోగం కేవలం శారీరకంగా కాకుండా మానసికంగా, సామాజికంగా, కుటుంబ రీత్యా కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని పోలీస్ అధికారులు తెలిపారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ వినియోగిస్తున్న, విక్రయిస్తున్న, కలిగి ఉన్న విషయమై టోల్ ఫ్రీ నంబర్ 112 లేదా 1972 నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.అదే విధంగా సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సైబర్ నేరాల విషయానికి వస్తే, నేటి టెక్నాలజీ ప్రపంచంలో చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టానికి దారి తీస్తుందని, సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్, అనుమానిత లింకుల ద్వారా సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, విద్యార్థులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నకిలీ ఐడెంటిటీతో వస్తున్న ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించకూడదని, అపరిచితుల మెసేజ్‌లు, లింకులు క్లిక్ చేయకూడదని పోలీస్ అధికారులు తెలిపారు.ఎవరైనా సైబర్ నేరాల బారిన పడ్డట్లు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించి, దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కి వెళ్లి వివరాలు తెలపాలని పోలీస్ అధికారులు విద్యార్థులకు సూచించారు.