రేపు 200 టిడ్కో గృహాలు లబ్ధిదారులకు స్వాధీనం* *ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు కృషి ఫలితం*





నరసరావుపేట, అక్టోబరు 22(పల్నాడుఅప్డేట్స్) నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 200 టిడ్కో ఇళ్లు అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేసుకొని, లబ్ధిదారులకు అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు కీలక పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ చర్యలకు చేయూతనిచ్చారు. అక్టోబరు 23న ఈ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్నట్లు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. బుధవారం డాక్టర్ చదలవాడ అరవింద బాబు టిడ్కో హౌసింగ్ కాలనీని సందర్శించి, అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో టిడ్కో కాలనీలను సకల సదుపాయాలతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మిగిలిన లబ్ధిదారులకు కూడా త్వరలో ఇళ్లను అప్పగిస్తామని, కోర్టు కేసుల్లో ఉన్న 270 ఇళ్ల విషయంలో సానుకూల నిర్ణయం త్వరలో వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, రుణాలు మంజూరు కాని 300 మంది లబ్ధిదారులకు బ్యాంకులతో క్యాంపులు ఏర్పాటు చేసి రుణాలు మంజూరు చేయించి ఇళ్లు అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ పెండింగ్‌లో ఉన్న ఇళ్ల ప్రక్రియను అక్టోబరు 23 నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ చదలవాడ అరవింద బాబు నాయకత్వంలో టిడ్కో కాలనీ అభివృద్ధి వేగవంతం కానుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నేతలు పాల్గొన్నారు.