భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

 


నరసరావుపేట అక్టోబర్ 22(పల్నాడుఅప్డేట్స్ )'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ద్వారా ప్రజల నుండి అందిన దరఖాస్తులకు నాణ్యమైన పరిష్కారంతో పాటు ప్రజల సంతృప్త స్థాయిని అడిగి తెలుసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ జి. జయలక్ష్మి కి చెప్పారు. రాష్ట్ర సచివాలయం నుండి బుధవారం పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారం, పేదలకు ఇళ్లస్థలా పట్టాల పంపిణీ, సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్, జిల్లాల విభజన, తదితర అంశాలపై భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ జి.జయలక్ష్మి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సిసిఎల్ఏ జయలక్ష్మి మాట్లాడుతూ పిజిఆర్ఎస్ ద్వారా అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కారం అనంతరం ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకోవాలన్నారు. ఇళ్లస్థల పట్టాలకోసం దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులను గుర్తించి ఇళ్ల స్థలాలు అందించాలన్నారు. పేదల గృహాల లేఅవుట్ లలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి, అందరికీ ఇళ్ళు పధకంలో అర్హులైన వారికి కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జిల్లాలో ప్రగతిని సిసిఎల్ఏ కి తెలియజేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పీజీఆర్ఎస్ దరఖాస్తులోని అంశాలను అధికారులు ధరఖాస్తుదారుని కలిసి వివరాలు తెలుసుకుని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కరించడం జరుగుతున్నదన్నారు. దరఖాస్తులు పరిష్కారం అనంతరం పరిష్కార విధానంపై ప్రజల సంతృప్తి స్థాయి ని అడిగి తెలుసుకుంటున్నామన్నారు. పేదల గృహాల లేఅవుట్ లలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి, అర్హులైన పేదలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.